జనసేన విస్తృతస్థాయి సమావేశం నుంచి మధ్యలోనే లేచి ఢిల్లీకి బయలుదేరిన పవన్ కల్యాణ్

11-01-2020 Sat 13:19
  • మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ
  • పవన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి
  • కేంద్ర ప్రభుత్వ ప్రముఖులను కలవనున్న పవన్

గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోన్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జనసేన విస్తృతస్థాయి సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే లేచి పవన్ కల్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు.

ఇక నేటి జనసేన సమావేశంలో అమరావతి రాజధాని తరలింపుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అమరావతిలో రైతుల పక్షాన నిలిచి, పోరాటం చెయ్యాలని జనసేన భావిస్తోంది. త్వరలోనే విజయవాడలో కవాతు నిర్వహించే అంశంపై జనసేన ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ప్రముఖుల అపాయింట్‌మెంట్‌ పవన్‌ కల్యాణ్‌కు ఖరారయిందని, అందుకే ఆయన హుటాహుటిన వెళ్లారని జనసేన నేతలు అంటున్నారు. ఆయన ఎవరిని కలుస్తారన్న ఆసక్తి నెలకొంది.