గుంటూరులో రాష్ట్ర బీజేపీ నేతల అత్యవసర భేటీ

11-01-2020 Sat 12:52
  • పార్టీ కార్యాలయంలో సమాలోచనలు
  • రాష్ట్ర శాఖ అధ్యక్షుడితోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు 
  • పార్టీ కార్యక్రమాలు, రాజధాని అంశంపై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతలు అత్యవసరంగా ఈ రోజు గుంటూరులో భేటీ అయ్యారు. రాజధాని అంశంపై రాష్ట్రంలో ప్రభుత్వ, విపక్షాల మధ్య పోరు సాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి రాష్ట్రానికి చెందిన ఎంపీలు జి.వి.ఎల్.నరసింహారావు, సుజనాచౌదరి, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పి.వి.ఎన్.మాధవ్, పార్టీ నాయకురాలు పురందేశ్వరి హాజరయ్యారు.

ఈ సమావేశంలో పార్టీ కార్యక్రమాలతోపాటు రాజధాని అంశంపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రాజధాని అంశంపై పార్టీ నాయకులు తలోరకమైన ప్రకటన చేస్తుండడంతో రాష్ట్ర ప్రజల్లో ఓ విధమైన అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం తర్వాతైనా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.