కాటేసిన కాని స్టేబుల్: ప్రియుడిని బెదిరించి ప్రియురాలిపై లైంగిక దాడి!

11-01-2020 Sat 12:00
  • జంట ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉండగా రాక
  • ఆమె స్నేహితుడిని బెదిరించి తరిమివేత
  • అనంతరం తోటలోకి లాక్కెళ్లి అఘాయిత్యం

'కంచే చేను మేసింది' అంటే ఇదేనేమో. బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ తానే నేరానికి పాల్పడ్డాడు ఓ కానిస్టేబుల్. స్నేహితుల జంట ఒంటరిగా ఉండగా ప్రియుడిని బెదిరించి, ప్రియురాలిని దూరంగా తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కటకటాలు లెక్కిస్తున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇవీ.

ఒంగోలు పట్టణానికి చెందిన వినయ్, ఓ షోరూంలో పనిచేసే యువతి స్నేహితులు. ఈ నెల 8వ తేదీన వినయ్ తన స్నేహితురాలితో కలిసి మంగమూరు రోడ్డు నుంచి పేర్నమిట్ట మార్గంలోకి వెళ్లాడు. అక్కడి తోట సమీపంలో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో కొత్తపట్నం స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాజుపాలెం ఆనంద్ వచ్చాడు.

ఇక్కడేం చేస్తున్నారంటూ వారిని బెదిరించాడు. తాను కాని స్టేబుల్ ని అంటూ గుర్తింపు కార్డు చూపించాడు. వినయ్ ని బెదిరించి అక్కడి నుంచి తరిమేశాడు. అనంతరం ఆ యువతిని ఇంటివద్ద దింపుతానంటూ చెప్పి తన బైక్ పై ఎక్కించుకున్నాడు. కాస్త దూరం వెళ్లాక ఆమెను తోటలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈలోగా వినయ్ తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారితో కలిసి వెతుకుతుండగానే సదరు యువతి నుంచి ఫోన్ రావడంతో ఆమెను కలిశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆనంద్ ను అరెస్టు చేశారు. గతంలోనూ ఆనంద్ పై లైంగిక దాడి ఆరోపణ ఉంది.