ఆయనొక నిస్సహాయ ముఖ్యమంత్రి: కేజ్రీవాల్ పై శశిథరూర్ విసుర్లు

11-01-2020 Sat 11:05
  • సీఏఏ గురించి స్పష్టమైన స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు?
  • ఏ ప్రాతిపదికన మీ పార్టీకి ప్రజలు ఓటు వేయాలి?
  • గాయపడ్డ విద్యార్థులను పరామర్శించవద్దని మీకు ఎవరు చెప్పారు?

పౌరసత్వ చట్టంపై స్పష్టమైన స్టాండ్ తీసుకోలేకపోతున్నారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ విమర్శలు గుప్పించారు. ఆయనొక నిస్సహాయ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. జేఎన్యూలో ముసుగులు ధరించిన వ్యక్తులు చేసిన దాడిలో గాయపడ్డ విద్యార్థులను కనీసం పరామర్శించలేదని దుయ్యబట్టారు.

సీఏఏకు అనుకూలంగా ఉన్నవారికి, వ్యతిరేకంగా ఉన్నవారికి అందరికీ అనుకూలంగా ఉండాలని కేజ్రీవాల్ అనుకుంటున్నారని... అందుకే ఈ అంశంపై ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకోలేకపోతున్నారని థరూర్ అన్నారు. ఈ అంశంపై మాట్లాడకపోతే... రానున్న ఎన్నికల్లో ఏ ప్రాతిపదికన ఆయన పార్టీకి ప్రజలు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఎవరి ఆదేశాల మేరకు కేజ్రీవాల్ వ్యవహరిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. జేఎన్యూలో చోటుచేసుకున్న హింస గురించి మాట్లాడవద్దని మీకు ఎవరు చెప్పారు? గాయపడ్డ విద్యార్థులను పరామర్శించవద్దని ఎవరు చెప్పారు? అని ప్రశ్నించారు. మీరొక ముఖ్యమంత్రి అని... ఇతరులెవరూ మిమ్మల్ని ఆదేశించలేరని హితవు పలికారు.