చంటి పిల్లల్ని అరెస్ట్ చేసే స్థాయికి దిగజారారు!: ఫొటోలు పోస్ట్ చేసిన నారా లోకేశ్

11-01-2020 Sat 10:44
  • చిన్న పిల్లాడిని వ్యానులో ఎక్కించిన పోలీసులు
  • ఓ యువతితో భద్రతా బలగాలు అనుచితంగా ప్రవర్తన
  • మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న లోకేశ్ 

అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రవరిస్తోన్న తీరు సరికాదంటూ టీడీపీ నేత నారా లోకేశ్ పలు ఫొటోలను పోస్టు చేశారు. నిరసనలో కూర్చున్న చిన్న పిల్లాడిని పోలీసులు వ్యానులో ఎక్కించిన ఫొటో కూడా అందులో ఉంది. మరోవైపు, ఓ యువతితో భద్రతా బలగాలు అనుచితంగా ప్రవర్తించినట్లు ఓ ఫొటోలో స్పష్టంగా కనపడుతోంది.

'చంటి పిల్లల్ని అరెస్ట్ చేసే స్థాయికి దిగజారిపోయారు జగన్ గారు. వైకాపా రాక్షస పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు హేయనీయం' అని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
'అరెస్ట్ చేసిన మహిళల్ని మీది ఏ కులమో చెబితే కానీ విడుదల చెయ్యం అని నిలదీస్తారా? ఈ ఘటనలతో మహిళలపై జగన్ గారికి ఉన్న గౌరవం ఏంటో సమాజానికి అర్థం అయ్యింది. అరెస్టులు కాదు దమ్ముంటే మా అక్కా, చెల్లెళ్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి' అని లోకేశ్ నిలదీశారు.