వాటిని పరిపాలన రాజధానులుగా రూపొందించారు కానీ మహానగరాలుగా కాదు: ఐవైఆర్ కృష్ణారావు

11-01-2020 Sat 10:12
  • ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, పాక్‌‌, కజికస్థాన్‌, మయన్మార్‌ రాజధానులపై వ్యాఖ్యలు
  • నేపిడా, బ్రెసిలియా తప్ప మిగిలినవన్నీ పరిపాలన రాజధానులు
  • అంతేగానీ మహానగరాలుగా కాదు
  • కాన్‌బెర్రా, అబూజ చర్చల తర్వాత అవగాహన కనుగుణంగా ఏర్పడ్డాయి

ప్రపంచంలోని పలు దేశాల్లో కొత్త రాజధానుల నిర్మాణం ముందు పరిశీలించిన అంశాల గురించి 'ఈనాడు' దినపత్రికలో వచ్చిన కథనాన్ని పోస్టు చేస్తూ ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తన అభిప్రాయాన్ని తెలిపారు.

ఆస్ట్రేలియాలో కాన్‌బెర్రా, బ్రెజిల్‌లో బ్రెసిలియా, పాక్‌లో ఇస్లామాబాద్‌, కజికస్థాన్‌లో ఆస్థానా, మయన్మార్‌లో నేపిడాలను అభివృద్ధి చేసి, రాజధానులుగా తీర్చిదిద్దడం వెనుక అక్కడి మౌలిక సదుపాయాలు, స్థలాల లభ్యతా కారణమయ్యాయని వచ్చిన ఆ కథనంపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

'ఈ అంతర్జాతీయ అనుభవాలలో కొన్ని ముఖ్య విషయాలు. నేపిడా, బ్రెసిలియా తప్ప మిగిలినవన్నీ పరిపాలన రాజధానులుగా రూపొందించారు కానీ మహానగరాలుగా కాదు. మహానగరాలుగా ప్రయత్నం జరిగిన పై రెండు నగరాలు విఫలంగా మిగిలాయి. కాన్‌బెర్రా, అబూజ లాంటి రాజధానులు చాలా చర్చల తర్వాత అవగాహన కనుగుణంగా ఏర్పడ్డాయి' అని ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు.