'ఢీ' డాన్స్ షో నుంచి తప్పుకున్న యాంకర్ ప్రదీప్

11-01-2020 Sat 10:06
  • యాంకర్ గా మంచి క్రేజ్ 
  • నటుడిగా చిన్న చిన్న పాత్రలు 
  •  త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న ప్రదీప్

బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యాంకర్ గా ప్రదీప్ కనిపిస్తాడు. పలు టీవీ షోలలో ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇటు స్టేజ్ పై తోటి సభ్యులు .. అటు ఆడియన్స్ ఎవరూ హర్ట్ కాకుండా మంచి సమయస్ఫూర్తితో మాట్లాడటం ప్రదీప్ ప్రత్యేకత.

అలాంటి ప్రదీప్ కి మంచి క్రేజ్ తెచ్చిన షోలలో 'ఢీ' ఒకటి. ఆ షో నుంచి ప్రదీప్ తప్పుకున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. వచ్చేవారానికి సంబంధించిన ప్రోమోలో ప్రదీప్ కనిపించకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ప్రదీప్ హీరోగా ఒక సినిమా రూపొందనుంది. ఆ సినిమా షూటింగు కారణంగానే ఆయన ఈ షో నుంచి తప్పుకున్నాడని అంటున్నారు. ఇప్పటివరకూ వెండితెరపై చిన్నచిన్న పాత్రలతో మెరుస్తూ వచ్చిన ప్రదీప్, త్వరలో హీరోగా ప్రేక్షకులను పలకరించనున్నాడన్న మాట.