అమెరికాలో ప్రవాసాంధ్రుల జై 'అమరావతి' నినాదాలు!

11-01-2020 Sat 09:49
  • అమరావతి రైతులకు ప్రవాసాంధ్రుల మద్దతు
  • సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సమావేశాలు
  • వివిధ నగరాల్లో సమావేశాలు

అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ జరుగుతున్న ఆందోళనలు అమెరికానూ తాకాయి. రాజధాని రైతులకు మద్దతుగా అమెరికాలోని వివిధ నగరాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు  ‘సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో నిరసనలు తెలియజేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాల్సిందేనని, అయితే అధికార వికేంద్రీకరణ మాత్రం తగదని నినదిస్తున్నారు.

అంతేకాదు, వాషింగ్టన్ డీసీ, చికాగో, డెలావేర్, పెన్సిల్వేనియా, ఆస్టిన్, న్యూజెర్సీ, డెమోయిన్స్ తదితర నగరాల్లో సమావేశాలు నిర్వహించి అమరావతిపై గళమెత్తారు. నేడు, రేపు కూడా పలు నగరాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రవాసాంధ్రులు తెలిపారు. ఏయే నగరాల్లో ఎప్పుడు సమావేశాలు నిర్వహించేదీ కార్యాచరణ ప్రకటించారు.