స్నేహితుడి ఇంట్లో ఉంటూ మృతి చెందిన తండ్రి.. రూ. లక్ష ఇస్తేనే కొరివి పెడతానన్న కుమారుడు!

11-01-2020 Sat 08:21
  • భార్య చనిపోయిన తర్వాత కొడుకు, కోడలు వేధింపులు
  • 17 ఏళ్ల క్రితం స్నేహితుడి ఇంటికి వెళ్లిపోయిన తండ్రి
  • తలకొరివి పెట్టేందుకు కుమారుడి నిరాకరణ

స్నేహితుడి ఇంట్లో మృతి చెందిన తండ్రికి తలకొరివి పెట్టేందుకు కుమారుడు నిరాకరించాడు. లక్ష రూపాయలు ఇస్తేనే కొరివి పెడతానంటూ మంకుపట్టు పట్టాడు. చివరికి పోలీసుల రంగ ప్రవేశంతో తండ్రికి కొరివి పెట్టాడా కుమారుడు. ఒడిశాలోని భద్రక్ జిల్లా బజరాపూర్‌లో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. అనామచరణ్ బంధు రిటైర్డ్ టీచర్. భార్య మృతి తర్వాత కొడుకు, కోడలు అతడిని వేధించడంతో భరించలేని ఆయన 17 ఏళ్ల క్రితం స్నేహితుడు గజేంద్ర సాహు ఇంటికి వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఇటీవల ఆయన అనారోగ్యం పాలు కావడంతో అతడి కుమారుడికి గజేంద్ర సాహు సమాచారం అందించాడు. అయినప్పటికీ ఆయన స్పందించలేదు. తండ్రిని చూసేందుకు రాలేదు.

బుధవారం రాత్రి అనామచరణ్ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. దీంతో ఈ విషయాన్ని ఆయన కుమారుడికి చెప్పి అంత్యక్రియలు నిర్వహించాలని గజేంద్ర కోరారు. అయితే, 17 ఏళ్లుగా తన తండ్రి పింఛను తీసుకుంటున్నాడని, తనకు ఏమాత్రం ఇవ్వలేదని.. అందుకని ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తేనే తలకొరివి పెడతానని, లేదంటే లేదని ఆయన తెగేసి చెప్పాడు. దీంతో గజేంద్ర పోలీసులను ఆశ్రయించారు. వారు అతడితో మాట్లాడి అంత్యక్రియలు జరిపించడంతో కథ సుఖాంతమైంది.