బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మళ్లీ లక్ష్మణ్‌కే పగ్గాలు?

11-01-2020 Sat 08:02
  • లక్ష్మణ్ పగ్గాలు చేపట్టి మూడేళ్లు 
  • రేసులో పలువురు సీనియర్లు
  • లక్ష్మణ్‌నే ఈసారికి కొనసాగించాలని అధిష్ఠానం నిర్ణయం?

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్ పదవీ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు గడిచిపోయాయి. బీజేపీ రాజ్యాంగం ప్రకారం మూడేళ్లు దాటితే అధ్యక్షుడిని మార్చాల్సి ఉంటుంది. అయితే, ఆయన పనితీరుపై సంతృప్తి చెందిన పార్టీ అధిష్ఠానం తిరిగి ఆయనకే పగ్గాలు అప్పజెప్పాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను మార్చి కొత్త వారిని నియమించడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని భావిస్తున్న అధిష్ఠానం పెద్దలు.. తిరిగి ఆయనకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల వేడి ఉండడంతో అవి ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం.

అధ్యక్ష పదవికి పలువురు సీనియర్లు పోటీపడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి వచ్చిన డీకే అరుణకు పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్టు అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. అలాగే, ఎంపీ బండి సంజయ్, సీనియర్ నేతలు చింతల రామచంద్రారెడ్డి, రాంచందర్‌రావు, యెండెల లక్ష్మీనారాయణ తదితరుల పేర్లను కూడా అధిష్ఠానం పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, చివరికి లక్ష్మణ్‌కే మరోమారు పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.