హైదరాబాద్‌లో దారుణం.. మోడల్‌పై బాలుడి అత్యాచారం.. వీడియో తీసిన స్నేహితుడు

11-01-2020 Sat 07:26
  • గంజాయి మత్తులో గదికి వచ్చి అత్యాచారం
  • ఫిర్యాదు మార్చి రాయలంటూ పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణ
  • నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పిన పోలీసులు

గత పరిచయంతో యువతి ఉంటున్న గదికి వచ్చిన బాలుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడగా, అతడి స్నేహితుడు వీడియో తీసిన ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మోడల్ కావాలన్న ఉద్దేశంతో గతేడాది నగరానికి వచ్చిన ఓ యువతి (21) అమీర్‌పేట, ఎల్లారెడ్డిగూడ సమీపంలో ఓ హాస్టల్‌లో దిగింది. అక్కడ ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హాస్టల్ యజమాని కుమారుడి (17)తో ఆమెకు పరిచయం ఏర్పడింది.

నాలుగు నెలల క్రితం యువతి సోదరి కూడా రావడంతో హాస్టల్ ఖాళీ చేసి జూబ్లీహిల్స్ ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని ఇద్దరూ ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెల 28న తన స్నేహితుడు నిఖిల్ రెడ్డి (19)తో కలిసి యువతి గదికి వచ్చిన హాస్టల్ యజమాని కుమారుడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిఖిల్ రెడ్డి వీడియో చిత్రీకరించాడు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి వెళ్లిపోయాడు.

ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు కేసు పెట్టాలని చెప్పడంతో తిరిగి నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గంజాయి మత్తులో తన గదికి వచ్చిన బాలుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది.

అయితే, పోలీసులు కేసు నమోదు చేయకుండా తనను ఇబ్బందులు పెడుతున్నారని, ఫిర్యాదు మార్చి రాయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని గత రాత్రి ఆమె మీడియా ఎదుట ఆరోపించింది. నిందితులను కుర్చీలో కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడుతున్నారని పేర్కొంది. అయితే, పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. నిందితులపై అత్యాచారం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిందితులు ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నట్టు పేర్కొన్నారు.