చివర్లో చిచ్చరపిడుగులా ఆడిన శార్దూల్ ఠాకూర్... భారత్ భారీ స్కోరు

10-01-2020 Fri 21:01
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు చేసిన టీమిండియా
  • ఫిఫ్టీలు నమోదు చేసిన రాహుల్, ధావన్
  • నిరాశ పరిచిన సంజూ శాంసన్

శ్రీలంకతో పుణేలో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. బౌలర్ గా జట్టులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ తన వంతు రాగానే మెరుపుదాడి చేసి కేవలం 8 బంతుల్లోనే చకచకా 22 పరుగులు సాధించడం విశేషం. ఠాకూర్ స్కోరులో 1 ఫోరు, 2 సిక్సులున్నాయి. అంతకుముందు టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (54), శిఖర్ ధావన్ (52) శుభారంభాన్నిచ్చారు.

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జట్టులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ తాను ఎదుర్కొన్న తొలిబంతినే సిక్స్ గా మలిచి తన ఉద్దేశాన్ని చాటాడు. కానీ ఆ తర్వాతి బంతికే అవుటై అభిమానులను ఉసూరుమనిపించాడు. ఇక కెప్టెన్ కోహ్లీ 26 పరుగులు చేయగా, మనీష్ పాండే 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. లంక బౌలర్లలో లక్షన్ సందకన్ 3 వికెట్లతో రాణించాడు.