నదిలో పడిపోయిన యూపీ పీసీసీ చీఫ్... చేయందించిన ప్రియాంక

10-01-2020 Fri 20:08
  • యూపీలో పర్యటించిన ప్రియాంక గాంధీ
  • వారణాసి పర్యటనలో అపశ్రుతి 
  • పట్టుతప్పి నదిలో జారిపడిన యూపీ పీసీసీ చీఫ్ అజయ్ లల్లూ

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేడు ఉత్తరప్రదేశ్ లో పర్యటించారు. ఆమె వెంట యూపీ పీసీసీ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ కూడా ఉన్నారు. అయితే వారణాసిలో పంచగంగ ఘాట్ వద్ద ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గంగానదిలో పడవ ఎక్కే క్రమంలో అజయ్ లల్లూ పట్టుతప్పి నీటిలో పడిపోయారు. దాంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ప్రియాంక, ఇతర కార్యకర్తలు సాయం చేయడంతో ఆయన సురక్షితంగా వెలుపలికి వచ్చారు. ఆయన నీటిలో పడింది ఒడ్డుకు కాస్త దూరంలోనే కావడంతో నీటిలో మునక నుంచి తప్పించుకున్నారు.