Telangana: మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఏం చేశారని ఓట్లు అడుగుతారు?: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • మున్సిపాలిటీల పరిస్థితి గత ఆరేళ్లలో ఏమాత్రం మారలేదు
  • మా అభ్యంతరాలను ప్రభుత్వం, ఈసీ పట్టించుకోలేదు
  • ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ దే విజయం

రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిస్థితి గత ఆరేళ్లలో ఏమాత్రం మారలేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరేళ్లలో చేసింది శూన్యమని విమర్శించారు. మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఏం చేశారని ఓట్లు అడగబోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ రోజు టెలీకాన్ఫరెన్స్ లో నూట ఇరవై మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్లలోని పార్టీ కార్యకర్తలతో ఉత్తమ్ మాట్లాడారు.

ఓటర్ల జాబితా, రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో ప్రకటించకుండానే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలను ప్రభుత్వం, ఈసీ పట్టించుకోలేదని మండిపడ్డారు.

సీఏఏపై కేసీఆర్ తీర్మానం చేయకున్నప్పటికీ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలంటూ.. సైనికుల్లా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.

More Telugu News