అరెస్ట్ చేసిన మహిళలను రాత్రి వేళ పోలీస్ స్టేషన్ లో ఎలా ఉంచుతారు?: టీడీపీ ఎంపీ కనకమేడల

10-01-2020 Fri 19:11
  • ఏపీ రాజధానిలో చల్లారని ఉద్రిక్తతలు
  • మహిళలను అరెస్ట్ చేశారంటూ కనకమేడల ఆగ్రహం
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్

ఏపీ రాజధానిని తరలిస్తున్నట్టు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో గత కొన్నివారాలుగా అమరావతి అట్టుడుకుతోంది. మహిళలు సైతం ఆందోళన చేస్తూ రాజధాని కోసం ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనలు తెలుపుతున్న మహిళలను అరెస్ట్ చేయడంపై టీడీపీ న్యాయవిభాగం అధ్యక్షుడు కనకమేడల రవీంద్ర కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

అరెస్ట్ చేసిన మహిళలను రాత్రి వేళ పోలీస్ స్టేషన్ లో ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. సాయంత్రం 6 గంటల తర్వాత పీఎస్ లో మహిళా కానిస్టేబుల్స్ లేకుండా మహిళలను ఎలా ఉంచుతారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మహిళా కమిషన్ కు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.