విజయవాడలో మహిళల ర్యాలీ.. టీడీపీ నాయకురాలు, సినీ నటి దివ్యవాణి అరెస్టు

10-01-2020 Fri 18:55
  • పీడబ్ల్యూడీ గ్రౌండ్స్- బెంజి సర్కిల్ వరకు మహిళల ర్యాలీ
  • విజయవాడలోని బందరు రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత
  • ప్రభుత్వ తీరుపై నల్ల చీరలు ధరించిన మహిళల నిరసన

రాజధాని అమరావతిని తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు, అఖిలపక్ష పార్టీలు నిరసనలు, ఆందోళనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి బెంజి సర్కిల్ వరకు మహిళల ర్యాలీ నిర్వహించారు.

స్వరాజ్ మైదానం, సివిల్ కోర్టు, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోలీసుల ఆంక్షలు అమలులో ఉండటంతో మహిళలను అడ్డుకున్నారు. విజయవాడలోని బందరు రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సినీ నటి దివ్యవాణి సహా పలువురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ బందర్ రోడ్ లోకి మహిళలు దూసుకొచ్చారు. ప్రభుత్వ తీరుపై మహిళలు నల్ల చీరలు ధరించి వచ్చి తమ నిరసన తెలిపారు. మరోపక్క, ఆర్డీఏ కార్యాలయం దగ్గర రోడ్డుపై మహిళలు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.