Loksatta: డబ్బు పంచకుండా గెలిచే పరిస్థితి లేదు.. ఎన్నికల వ్యవస్థ మారాలి: ‘లోక్ సత్తా’ జేపీ

  • ‘మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’ అనే అంశంపై సదస్సు
  • అందరూ డబ్బుకు బందీలైపోయారు
  • డబ్బు పంచకుండా, అక్రమ ఖర్చు పెట్టకుండా గెలిచే ఊసే లేదు

డబ్బు లేనిదే రాజకీయం లేదన్నట్టుగా మారిపోయిందని ‘లోక్ సత్తా’  అధినేత జయప్రకాశ్ నారాయణ (జేపీ) అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ‘మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’ అనే అంశంపై ఆయన ఓ సదస్సు నిర్వహించారు.

‘ఎన్నికల్లో డబ్బు ప్రభావం తీవ్రంగా ఉందని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా, ఎన్నికలు వచ్చినప్పుడు అదే ప్రభావం చూపించడానికి కారణం?’ అనే ప్రశ్నకు జేపీ స్పందిస్తూ, ‘అందరూ దానికి బందీలైపోయారు. తొంభై తొమ్మిది మందికి డబ్బులు పంచకుండా, అక్రమ ఖర్చు పెట్టకుండా, వేలాది కార్యకర్తలను మెయిన్ టెన్ చేయకుండా ఎన్నికల్లో గెలిచే ఊసే లేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు.

లోక్ సభ నియోజకవర్గంలో ఐదారు లక్షల మందికి డబ్బులు పంచుతున్నారని, అంతమాత్రాన ఓట్లు వేస్తారని కాదు, అసలు ఓట్లు పడవేమోనని’ అన్నారు. దేశం మొత్తంలో జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్య నాలుగు లక్షల మంది అని, మరి, ఒక నియోజకవర్గంలో డబ్బులు తీసుకున్న ఐదారు లక్షల మందిని జైల్లో పెట్టడం సాధ్యమవుతుందా? అన్న కోణంలో ప్రశ్నించిన ఆయన, మర్డర్లు చేసిన వారినే జైళ్లలో పెట్టలేని దేశంలో ఎన్నికల్లో డబ్బులు తీసుకున్న వారిని జైల్లో పెట్టలేరని అభిప్రాయపడ్డారు. కేవలం, ఎన్నికల వ్యవస్థ మారడం ద్వారానే మార్పు సాధ్యమవుతుందని, అలా జరగని పక్షంలో నేతి బీరకాయలో నేతి చందంగా దేశంలో ‘ప్రజాస్వామ్యం’ ఉంటుందని అభిప్రాయపడ్డారు.

More Telugu News