వేగంగా వెళుతున్న కారులోంచి జారిపడినా.. స్వల్పగాయాలతో బయటపడ్డ చిన్నారి

10-01-2020 Fri 16:19
  • వీడియో పోస్ట్ చేసిన ఐపీఎస్ అధికారి
  • సీట్ బెల్ట్, డోర్ లాక్, నిర్ణీత వేగం.. ఆవశ్యకతపై సందేశం
  • భద్రతా నిబంధనలు పాటించండంటూ సందేశం

నడుస్తోన్న కారులోంచి జారిపడిన ఆ చిన్నారి, తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకుని మృత్యుంజయు రాలయింది. ఈ ఘటన రెండు వారాల క్రితం కేరళలో జరిగినప్పటికీ.. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో తాజాగా ఐపీఎస్ అధికారి పంకజ్ నయన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చైల్డ్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ అంశాల్ని పేర్కొంటూ.. వీడియోను జతపర్చారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం, డోర్లు లాక్ చేసుకోవడం నిర్ణీత వేగంతో వెళ్లడం ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా వీక్షకులు గుర్తిస్తారని పంకజ్ తన సందేశంలో పేర్కొన్నారు.

ఘటన తాలూకు విషయం ఏమిటంటే.. వేగంగా వెళుతున్న కారు వెనక డోర్ అనుకోకుండా తెరుచుకోవడంతో.. ఓ చిన్నారి జారి రోడ్డుపైన పడిపోయింది. ముందు మలుపు ఉండటంతో వెనక నుంచి వచ్చే వాహనం వేగం తగ్గించడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఆ చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ వీడియోను మీరూ చూసేయండి.. జాగ్రత్తలు పాటించండి అంటూ పంకజ్ ట్వీట్ చేశారు.