బిగ్ బాస్-4 హోస్ట్ గా మళ్లీ ఎన్టీఆర్?

10-01-2020 Fri 16:12
  • తొలి సీజన్ కు హోస్ట్ చేసిన జూనియర్
  • ఇప్పటికి మూడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్
  • నాలుగో సీజన్ పై ఆసక్తికర ప్రచారం

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన ఈ కార్యక్రమం భారత్ లోనూ అద్వితీయ ప్రాచుర్యం పొందింది. ఆఖరికి ప్రాంతీయ భాషల్లోనూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు పూర్తయ్యాయి. తొలి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండో సీజన్ కు నాని, మూడో సీజన్ కు నాగార్జున హోస్ట్ గా చేశారు. ఇప్పుడు నాలుగో సీజన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారం అవుతోంది. బిగ్ బాస్-4 కోసం నిర్వాహకులు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ నే సంప్రదించారని, కళ్లుచెదిరే మొత్తాన్ని ఆఫర్ చేశారని టాక్ వినిపిస్తోంది.

కాగా, బిగ్ బాస్ మూడో సీజన్ ను నాగ్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా నడిపించడంతో ఆయన్నే కంటిన్యూ చేస్తారని అందరూ భావించారు. కానీ తాజా ప్రచారంతో బిగ్ బాస్ కొత్త సీజన్ హోస్ట్ ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే సమయానికి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా పూర్తవుతుంది. దాంతో ఈ షోకి హోస్ట్ గా చేయడానికి ఎన్టీర్ కు కూడా ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, ఈసారి హోస్ట్ రేసులో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా దీనిపై తుది ప్రకటన చేయాల్సింది బిగ్ బాస్ నిర్వాహకులే!