తెలివి నీ ఒక్కడి సొత్తు కాదు జగన్.. అందరికీ ఉంటుంది: జేసీ దివాకర్ రెడ్డి

10-01-2020 Fri 14:33
  • రాజధానిని ముక్కలు చేసి తరలిస్తానంటే కుదరదు
  • సీఎం తానే తెలివిగలవాడ్నని అనుకుంటున్నారని విమర్శలు
  • గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమిస్తామని హెచ్చరిక

ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేకత. తాజాగా తన ట్రేడ్ మార్క్ కామెంట్స్ తో సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. మనిషి శరీరానికి తల ఎంత ప్రధానమైనదో, రాష్ట్రానికి రాజధాని కూడా అంతే ముఖ్యమైనదని పేర్కొన్నారు.

కానీ సీఎం జగన్ తల నరికి ఇంకో చోట పెడతానని, మొండేన్ని మరో చోట పెడతానని అంటున్నాడని ఎద్దేవా చేశారు. తెలివి నీ ఒక్కడి సొత్తు అనుకోవద్దు జగన్.. అందరికీ ఉంటుంది అని హితవు పలికారు. రాజధానిని ముక్కలుగా చేసి తరలిస్తానంటే కుదరదని స్పష్టం చేశారు.

"అమరావతిలో రాజధాని అంటేనే చాలా దూరం అనుకున్నాం, ఇప్పుడు అక్కడి నుంచి కూడా తరలిస్తున్నారు. సీఎం చాలా తెలివిగా వ్యవహరిస్తున్నానని అనుకుంటున్నారు. రాజధానిని తరలిస్తే గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమించడం ఖాయం"అని హెచ్చరించారు.