సీఎం వీడియో గేముల్లో మునిగితేలుతుంటే, మంత్రులు కోడిపందాలు ఆడుతున్నారు: యనమల విసుర్లు

10-01-2020 Fri 14:22
  • వైసీపీ ప్రభుత్వంపై యనమల ధ్వజం
  • ఏ సీఎం ఇంత చెడ్డపేరు తీసుకురాలేదని వ్యాఖ్యలు
  • కోర్టు బోనులో నిలబడ్డ తొలి సీఎం జగనేనని విమర్శలు

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేరప్రవృత్తి ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడని, అందుకే ప్రజలు కష్టాల పాలవుతున్నారని అన్నారు.

ఓవైపు రాష్ట్రం ఆందోళనలతో అట్టుడికిపోతుంటే ఈ సీఎం వీడియో గేముల్లో మునిగితేలుతున్నాడని, మంత్రులు కోడిపందాలు ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్రలో ఏ సీఎం కూడా రాష్ట్రానికి ఇంత చెడ్డపేరు తీసుకురాలేదని, కోర్టు బోనులో నిలబడ్డ తొలి సీఎం జగనేనని యనమల విమర్శించారు. సీఎం జగన్ తో పాటే వైసీపీ నేతలు, అధికారులు జైలుకు వెళ్లడం తథ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.