Iran: విమాన ప్రమాదంపై ఇరాన్ ను ఇరకాటంలో పడేసిన వీడియో ఇదే..!

  • టెహ్రాన్ లో బుధవారం ఘోర విమాన ప్రమాదం
  • మండుతున్న అగ్నిగోళంలా కూలిపోయిన ఉక్రెయిన్ విమానం
  • ఇరాన్ పై అనుమానాలు

అమెరికా, ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో ఇరాన్ గడ్డపై ఉక్రెయిన్ విమానం కూలిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. సాంకేతిక వైఫల్యం కారణంగానే విమానం కూలిపోయిందని మొదట్లో భావించినా, విమానం బ్లాక్ బాక్స్ ను ఇరాన్ చేజిక్కించుకుని విమానయాన సంస్థకు దాన్ని అప్పగించేందుకు ససేమిరా అనడంతో సందేహాలు బయల్దేరాయి. ఏదైనా క్షిపణి దాడి కారణంగా విమానం నేలకూలి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ అనుమానాలకు, అభిప్రాయాలకు బలం చేకూరుస్తూ ఇప్పుడో వీడియో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

ఆ వీడియోలో, టెహ్రాన్ గగనతలంపై వెళుతున్న విమానాన్ని దూసుకొచ్చిన ఓ అగ్నిగోళం వంటి వస్తువు ఢీకొనడం కనిపించింది. ఆ తర్వాత విమానం మండిపోతూ నేలకొరిగింది. కాగా తనపై విమర్శలు వస్తుండడంతో బ్లాక్ బాక్స్ లో ఉన్న సమాచారాన్ని ఉక్రెయిన్ తో పంచుకుంటామని చెప్పిన ఇరాన్ కు తాజా వీడియో మింగుడుపడడంలేదు.

కాగా, ఈ విమాన ప్రమాదంలో 63 కెనడా జాతీయులు కూడా దుర్మరణం పాలవడంతో ఆ దేశ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ, ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నుంచి వచ్చిన రెండు క్షిపణుల్లో ఒకటి విమానాన్ని తాకినట్టు తమ వద్ద నమ్మదగిన సమాచారం ఉందని తెలిపారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం, ఎవరో తప్పు చేశారంటూ పరోక్షంగా ఇరాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

More Telugu News