తైపీ అమ్మాయి చేతిలో వరుస గేముల్లో ఓడిన పీవీ సింధు

10-01-2020 Fri 13:38
  • మలేసియా మాస్టర్స్ టోర్నీలో ముగిసిన సింధు ప్రస్థానం
  • క్వార్టర్ ఫైనల్లో తై ఝు యింగ్ చేతిలో ఓటమి
  • పురుషుల విభాగంలోనూ భారత ఆటగాళ్లకు తప్పని పరాజయం

ప్రపంచ బ్యాడ్మింటన్ షిప్ లో విజేతగా నిలబడి చరిత్ర సృష్టించిన పీవీ సింధు ఆ తర్వాత అనేక మేజర్ టోర్నీల్లో తడబడింది. ఆ పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ మరోసారి ఓటమితో సరిపెట్టుకుంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ఇక్కడి అక్సియాటా ఎరీనా ఇండోర్ స్టేడియంలో జరిగిన పోరులో సింధు 16-21, 16-21 తో వరుసగా గేముల్లో చైనీస్ తైపీ క్రీడాకారిణి తై ఝు యింగ్ చేతిలో ఓటమిపాలైంది. నెంబర్ వన్ సీడ్ తై ఝు ధాటికి సింధు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.

ఈ టోర్నీలో భారత పురుషుల పోరాటం రెండో రౌండ్ తో సమాప్తి అయింది. కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్ వంటి స్టార్ ఆటగాళ్లు తొలిరౌండ్ లోనే బోర్లా పడగా, సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ రెండో రౌండ్ లో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.