రజనీ సినిమాలో శశికళకు వ్యతిరేకంగా డైలాగ్... 'దర్బార్'పై దుమారం!

10-01-2020 Fri 12:34
  • నిన్న విడుదలైన దర్బార్
  • ఓ జైల్ సీన్ లో డైలాగులపై అభ్యంతరాలు
  • తొలగించాలంటున్న శశికళ వర్గీయులు

రజనీకాంత్ కొత్త చిత్రం, నిన్న వెండితెరలను తాకి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'దర్బార్' పై ఇప్పుడు ఓ కొత్త దుమారం మొదలైంది. ఈ చిత్రంలో శశికళకు వ్యతిరేకంగా డైలాగులు ఉన్నాయని, వాటిని తొలగించాల్సిందేనని ఆమె తరఫు వర్గీయులు డిమాండ్ చేశారు.

ఈ చిత్రంలోని ఓ జైలు సన్నివేశంలో, ముంబై పోలీసు కమిషనర్ హోదాలో రజనీ వెళుతుంటే, ఓ ఖైదీ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. ఆపై డబ్బులుంటే ఖైదీలు షాపింగ్ కు కూడా వెళ్లవచ్చన్న డైలాగ్ ఉంది. వాస్తవానికి ఈ డైలాగ్ కు ముందు, వెనుక శశికళ సహా ఎవరి పేరూ వినపడకున్నా, ఈ డైలాగ్ ఆమెను ఉద్దేశించే పెట్టారని అభిప్రాయపడుతున్నారు.

బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళ, బయటకు వెళ్లి షాపింగ్ చేసి వచ్చారని ఆ మధ్య వార్తలు బయటకు రాగా, జైలు అధికారులపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'దర్బార్' చిత్రంలో ఈ డైలాగ్ ను తొలగించాలని శశికళ తరఫు న్యాయవాది డిమాండ్ చేశారు.