SBI: ఇంటి రుణాలు తీసుకునే వారికి బంపరాఫర్ ను ప్రకటించిన ఎస్బీఐ!

  • 'రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ విత్ బయ్యర్ గ్యారెంటీ'
  • అనుకున్న సమయానికి డెలివరీ కాకుంటే చెల్లించిన మొత్తం వెనక్కు
  • మరే బ్యాంకూ ఇటువంటి స్కీమ్ ను పెట్టలేదన్న ఎస్బీఐ చైర్మన్

గృహ రుణ వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపరాఫర్ ను ప్రకటించింది. 'రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ విత్ బయ్యర్ గ్యారెంటీ' పేరిట రూ. 2.50 కోట్ల వరకూ ఈ రుణ సదుపాయం వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది. ఈ విధానం అర్హత ఉన్న బిల్డర్ల ప్రాజెక్టుల్లో అపార్టుమెంట్లు, విల్లాలను కొనుగోలు చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది.

ఈ ఆఫర్ కింద, నిర్దేశిత గడువులోగా ఇంటిని బిల్డర్ అప్పగించకుంటే, రుణ గ్రహీత చెల్లించిన ప్రిన్సిపల్ మొత్తాన్ని బ్యాంకు వెనక్కు తిరిగి ఇస్తుంది. ఉదాహరణకు... కోటి రూపాయల విలువైన ఇంటిని కొనుగోలు చేసిన రుణ గ్రహీత, రూ. 30 లక్షలను అడ్వాన్స్ గా చెల్లించారనుకోండి. బిల్డర్ హామీ మేరకు అనుకున్న సమయానికి ఇంటిని హ్యాండోవర్ చేయకుంటే, బ్యాంకు ఆ రూ. 30 లక్షలను వెనక్కు ఇస్తుంది. బిల్డర్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ పొందేంత వరకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

ఈ విషయాన్ని వెల్లడించిన బ్యాంకు చైర్మన్ రజనీశ్ కుమార్, ఈ తరహా హోమ్ ఫైనాన్స్ స్కీమ్ దేశంలో మరే బ్యాంకూ ఇవ్వడం లేదని అన్నారు. కస్టమర్ల నుంచి ఈ స్కీమ్ కు మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. తొలి విడతలో ముంబై మెట్రో పాలిటన్ లో భాగమైన సన్ టెక్ డెవలపర్స్ లో ఇళ్లను కొనే వారికి ఈ స్కీమ్ కింద రుణాలను అందించనున్నామని, ఆపై దశల వారీగా మిగతా నగరాల్లో విస్తరిస్తామని అన్నారు.

ఇదే సమయంలో అర్హత పొందిన బిల్డర్లకు రూ. 50 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకూ రుణాలను అందించనున్నామని, ఇందులో భాగంగా రుణం పొందిన బిల్డర్, ఆపరేషనల్ క్రెడిటార్ల నుంచి రుణాలు తీసుకునే అవకాశం ఉండదని, ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎస్క్రో ఖాతాలో వేయాలన్న నిబంధనను అమలు చేస్తామని రజనీశ్ కుమార్ తెలిపారు.

More Telugu News