గత ఏడాది మార్చి 22న చివరిసారిగా కోర్టుకు హాజరైన జగన్

10-01-2020 Fri 11:32
  • నెలల తరబడి విచారణకు హాజరుకాకపోవడంతో సీబీఐ కోర్టు అసహనం
  • తప్పకుండా హాజరుకావాలని ఆదేశించిన న్యాయస్థానం
  • సీఎం అయిన తర్వాత తొలిసారి సీబీఐ కోర్టుకు వచ్చిన జగన్

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, పారిశ్రామికవేత్త ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ తదితరులు కూడా కోర్టుకు వచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకు జగన్ రావడం ఇదే ప్రథమం.

గత ఏడాది మార్చి 22న చివరిసారిగా కోర్టు విచారణకు జగన్ హాజరయ్యారు. అదే సమయంలో ఎన్నికలు రావడం, ఆ తర్వాత సీఎం కావడంతో... జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరుతూ వచ్చారు. అయితే, నెలల తరబడి విచారణకు హాజరు కాకపోతుండటంతో కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాలని జగన్, విజయసాయిరెడ్డిలను ఆదేశించింది. హాజరుకాకపోతే తగు ఉత్తర్వులను జారీ చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, వీరిద్దరూ ఈరోజు విచారణకు హాజరయ్యారు.