దేశంలో 30 శాతం ఆత్మహత్యలకు ఇదే కారణం!

10-01-2020 Fri 11:21
  • అనారోగ్యం కారణాలతో అధిక శాతం బలవన్మరణం 
  • మానసికంగా కుంగిపోయి తీవ్ర నిర్ణయం 
  • సూసైడ్స్ లో ఏపీది దేశంలో నాలుగో స్థానం

క్షణికావేశం, అనుకోని పరిస్థితులు, ఇబ్బందులు, ఇతరత్రా కారణాలతో ఏటా కొందరు ఆత్మహత్యకు పాల్పడుతుండడం సహజం. ఆత్మహత్యల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో అత్యధికంగా మూడో వంతు అనారోగ్యం సమస్యలతోనే బలవన్మరణాన్ని ఆశ్రయిస్తున్నారని జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదిక తేల్చింది.

 తీవ్రమైన అనారోగ్యం బారిన పడడం, మరి కోలుకోలేమేమో అన్న భయం వీరు తీవ్ర నిర్ణయం తీసుకునేలా ప్రేరేపిస్తున్నాయని నిర్ధారించింది. 2018లో ఏపీలో 5,319 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, వీరిలో 1610 మంది అంటే 30.4 శాతం మంది అనారోగ్య సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారని తేలింది.

వ్యాపారం దివాలా తీయడం, అప్పుల బాధల వల్ల 4,922 మంది చనిపోయారు. కుటుంబ సమస్యలతో 1515 మంది, ప్రేమ విఫలమై 154 మంది ప్రాణాలు తీసుకున్నారు.