బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సీబీఐ కోర్టుకు వెళ్లిన జగన్

10-01-2020 Fri 10:53
  • అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరైన జగన్
  • అరగంట ముందే కోర్టుకు చేరుకున్న విజయసాయిరెడ్డి, ధర్మాన
  • విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించిన కోర్టు

అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాదులోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి నేరుగా సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. అంతకుముందే సీబీఐ కోర్టుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు, కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తదితరులు చేరుకున్నారు.

పాలనా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందువల్ల కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాలేనని కోర్టును జగన్ కోరిన నేపథ్యంలో, ఇన్నాళ్లు ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపును ఇచ్చింది. అయితే, ఈరోజు తప్పనిసరిగా విచారణకు హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించడంతో... ఆయన ఈరోజు విచారణకు హాజరయ్యారు. సీఎం అయిత తర్వాత కోర్టు విచారణకు జగన్ హాజరుకావడం ఇదే తొలిసారి. మరోవైపు, కాసేపటి క్రితమే కోర్టు హాల్లోకి న్యాయమూర్తి ప్రవేశించారు.