Crime News: సాయం చేయబోయి.. తానే మృత్యుఒడిలోకి!

  • నీటి కుంట బురదలో చిక్కుకుని మృతి
  • మృతశిశువును వెలికితీయబోయి బురదలో కూరుకుపోయిన వైనం  
  • స్థానికులు కాపాడేలోగానే ఆఖరిశ్వాస

మృతశిశువును వెలికితీసేందుకు పోలీసులకు సాయం చేయబోయి తానే మృత్యుఒడిలోకి చేరిన విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నీటి కుంటలోని బురదలో చిక్కుకుని ఊపిరాడక ఓ వ్యక్తి చనిపోయాడు. 

పోలీసుల కథనం మేరకు...జిల్లాలోని వర్ని మండల కేంద్రం శివారున నిజాంసాగర్ ప్రధాన కాలువ ఉంది. దీనికి చెంతనే ఓ నీటికుంట ఉంది. ఈ నీటి కుంటలో ఓ శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెద్ద సంఖ్యలో పోలీసులు, స్థానికులు గుమిగూడి శిశువు మృతదేహాన్ని వెలికి తీయడంపై చర్చించుకుంటున్నారు.

ఈ సందర్భంలో సేవాలాల్ తండాకు చెందిన వెంకటి (32) మృతదేహాన్ని వెలికి తీసేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా నీటికుంటలోకి దిగాడు. అయితే కుంటలో బురద బాగా పేరుకుపోయి ఉండడంతో అందులో చిక్కుకుని మునిగిపోయాడు.

దీన్ని గుర్తించిన స్థానికులు వెంకటిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తుండగానే అతను పూర్తిగా మునిగిపోయి ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు కారణమయింది. పోలీసుల ఒత్తిడి వల్లే వెంకటి కుంటలోకి దిగి ప్రాణాలు కోల్పోయాడంటూ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు.

పోలీసులు ఎంతగా నచ్చచెప్పినా వినలేదు. తమకు న్యాయం చేసేవరకు వెళ్లనివ్వమని పట్టుబట్టారు. దాదాపు రెండు గంటల పాటు ఉద్రిక్తత అనంతరం పోలీసుల హామీతో స్థానికులు శాంతించారు.

More Telugu News