అదృశ్యమైన కన్నడ హీరోయిన్ విజయలక్ష్మి తిరిగి ప్రత్యక్షం.. తల్లిపై సంచలన ఆరోపణలు!

10-01-2020 Fri 10:04
  • నిర్మాత నుంచి డబ్బు తీసుకుని పారిపోయినట్టు ఆరోపణలు
  • గంగావతిలో లవర్ ను పెళ్లాడి, పోలీసులను ఆశ్రయించిన విజయలక్ష్మి
  • తల్లిదండ్రులపై సంచలన ఆరోపణలు

కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపిన హీరోయిన్ విజయలక్ష్మి అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఓ సినీ నిర్మాత నుంచి ఆమె డబ్బు తీసుకుని పారిపోయినట్టు వార్తలు రాగా, తాజాగా ఆమె రాయచూరులో తన భర్త ఆంజనేయతో కలిసి ప్రత్యక్షమై, తల్లిదండ్రులపై సంచలన ఆరోపణలు చేసింది.

 హళ్లి హోసూరు పోలీసు స్టేషన్ కు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ, తాను ఆంజనేయను ప్రేమించానని, గంగావతిలో వివాహం చేసుకున్నానని, ఇది నచ్చక తన తల్లి సవిత, అమ్మమ్మ విషం తాగి సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు వార్తలను సృష్టించి డ్రామాలాడారని ఆరోపించింది.

తన కన్న తండ్రి నుంచి తల్లి సవిత ఆరేళ్ల క్రితమే విడిపోయి, మరో వ్యక్తిని వివాహం చేసుకుందని, పెంచిన తండ్రి పెట్టే బాధలను తాను తట్టుకోలేకపోతున్నానని సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తను చంపేందుకు కూడా కుట్ర చేశారని, తాను ఎవరి నుంచీ డబ్బులను, బంగారాన్ని తీసుకోలేదని చెప్పింది. తాను పెళ్లి చేసుకోకూడదని, డబ్బులు సంపాదిస్తూ ఉండాలన్నదే వారి అభిమతమని ఆరోపించింది. జిల్లా పోలీసులను కలసి రక్షణ కల్పించాలని కోరినట్టు పేర్కొంది.