ఆ విమానాన్ని ఇరానే కూల్చేసిందా?.. బలపడుతున్న అనుమానాలు!

10-01-2020 Fri 08:49
  • 180 మందితో వెళ్తూ టెహ్రాన్‌లో కూలిన విమానం
  • ఇరాన్ మిసైల్ దాడి కారణంగానే కూలిందని అనుమానాలు
  • ఎవరో ఒకరు తప్పు చేసి ఉండొచ్చన్న ట్రంప్

ఇరాన్ రాజధాని టెహ్రాన్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంపై అనుమానాలు బలపడుతున్నాయి. 180 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయిన ఉక్రెయిన్ విమానం కాసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో 176 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ విమానాన్ని ఇరానే పొరపాటున కూల్చివేసి ఉంటుందన్న అనుమానులు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇలాంటి అనుమానాన్నే వ్యక్తం చేశారు. ఇది సాంకేతిక వైఫల్యం అయి ఉండదని, ఎవరో ఒకరు తప్పు చేసి ఉండొచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ఘోరమైనదేదో జరిగిందని, ఇది చాలా దారణమని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, అమెరికా సైనిక, నిఘా సంస్థలు సేకరించిన ఉపగ్రహ, రాడార్ డేటా విశ్లేషణలు కూడా విమానంపై దాడి జరిగినట్టే సూచిస్తున్నాయి. క్షిపణి దాడి వల్లే అది కూలి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. విమానం కూలిపోవడానికి సాంకేతిక తప్పదం ఎంతమాత్రమూ కారణం కాదని, ఎవరో కూల్చివేసి ఉంటారని యూరోపియన్ యూనియన్ కూడా పేర్కొంది.

విమాన ప్రమాదంపై అన్ని వేళ్లూ ఇరాన్‌వైపే చూపిస్తుండడంతో ఇరాన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. జరిగిన దానికి ఇరాన్ సమాధానం చెప్పాలని పశ్చిమాసియా దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. విమానం ఇంజిన్ వేడెక్కి మంటలు చెలరేగడంతో గుర్తించిన పైలట్ తిరిగి విమానాశ్రయానికి వచ్చేందుకు ప్రయత్నించాడని ఇరాన్ పౌరవిమానయాన శాఖ చీఫ్ అలీ అబెద్‌జాదె తెలిపారు. విమానానికి మిసైల్ తగిలితే దానిని వెనక్కి తిప్పడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కాగా, విమాన ప్రమాదంపై లోతుగా విచారణ జరపాలని ఉక్రెయిన్, కెనడాలు నిర్ణయించాయి.