యూఎస్ లో 'అల వైకుంఠపురములో..' టికెట్లపై భారీ ఆఫర్లు!

10-01-2020 Fri 08:34
  • అమెరికాలో పెద్ద ఎత్తున విడుదల అవుతున్న చిత్రం
  • తమ వ్యాపారాలు పెంచుకునేందుకు కంపెనీల ప్లాన్
  • పలు ఆఫర్లతో పాటు ఉచిత టికెట్లు కూడా

సంక్రాంతి పర్వదినాల్లో ప్రజలు సొంత ఊర్లలో ఉండి, తమ బంధుమిత్రులతో కలిసి పండగ జరుపుకుంటారు. అదే విదేశాల్లో ఉంటే, సంక్రాంతికి విడుదల అయ్యే తెలుగు సినిమాలను చూసి పండగ చేసుకుంటారని అంతా అంటుంటారు. ఈ సీజన్ లో కూడా చాలా సినిమాలు విడుదల కానున్నాయి.

అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో..' అమెరికాలో పెద్ద ఎత్తున విడుదల కానుండగా, ప్రేక్షకులను థియేటర్లకు తీసుకుని వచ్చేందుకు, తమ వ్యాపారాలను పెంచుకునేందుకు టికెట్ ధరలపై పలు ఆఫర్లను డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు.

రీగల్ సినిమాస్, తామందించే రీగల్ అన్ లిమిటెడ్ పాస్ కొనుగోలు చేసిన వారికి టికెట్లను ఉచితంగా ఇస్తోంది. మరికొన్ని చోట్ల రెండు డాలర్లకే టికెట్లను అమ్ముతోంది. ఏఎమ్ సీ సంస్థ తమ స్టబ్స్ ఏ-లిస్ట్ చందాదారులకు కూడా ఉచితంగా టికెట్లు ఇస్తోంది.  సినిమా టికెట్ 14 డాలర్ల వరకూ ఉండగా, సినీమార్క్ సినిమాస్, మూవీ క్లబ్ పాస్ ఉన్న వారికి ధరలో ఐదు డాలర్ల డిస్కౌంట్ ను ప్రకటించింది. ఆటమ్స్ టికెట్స్ కంపెనీ, తమ వెబ్ సైట్ నుంచి టికెట్లు బుక్ చేసి చేజ్ పే ద్వారా చెల్లింపు జరిపితే 7 డాలర్ల డిస్కౌంట్ ను అందిస్తున్నట్టు తెలిపింది.