Rajasthan: వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని.. పాము కాటుతో తెలివిగా అత్తను హత్య చేసిన కోడలు!

  • ఆర్మీలో పనిచేస్తున్న భర్త
  • వివాహేతర సంబంధానికి అడ్డుగా అత్త..
  • ప్రియుడితో కలిసి అనుమానం రాకుండా హత్య

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న ఉద్దేశంతో అత్తను తెలివిగా అడ్డుతొలగించుకుందో కోడలు. హత్య తర్వాత ఆమె ప్రవర్తించిన తీరు అత్త తరపు బంధువుల్లో అనుమానాలు రేకెత్తించింది. దీంతో ఇప్పుడా కోడలు కటకటాలు లెక్కపెట్టుకుంటోంది. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అల్పన, సచిన్ భార్యభర్తలు. సచిన్ సైన్యంలో పనిచేస్తుండడంతో అల్పన.. అత్త సుబోధ్ దేవితో కలిసి ఉంటోంది. సుబోధ్ దేవి భర్త రాజేశ్ ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నారు.

ఈ క్రమంలో జైపూర్‌కు చెందిన మనీష్ అనే వ్యక్తితో అల్పనకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం, చాటింగ్‌లు మితిమీరడంతో గమనించిన సుబోధ్ దేవి కోడల్ని మందలించింది. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని అల్పన ప్లాన్ చేసింది. ప్రియుడు మనీష్‌తో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా పాముతో కాటువేయించి హత్య చేసింది. గతేడాది జూన్ 2న ఈ ఘటన జరిగింది.

సుబోధ్ దేవి మరణించిన నెలన్నర తర్వాత అల్పన ప్రవర్తనను చూసి సుబోధ్ దేవి బంధువులు అనుమానించారు. ఆమెపై నిఘా పెట్టారు. వారి అనుమానాలు బలపడ్డాయి. సుబోధ్ దేవిని ఆమెనే హత్య చేసిందని పక్కాగా నిర్ధారించుకున్న తర్వాత పోలీసులును కలిసి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా పోలీసులకు అందజేశారు. అల్పన, మనీష్‌ల ఫోన్ నంబర్లను పోలీసులకు అందించారు.

పోలీసులు ఆ రెండు నంబర్ల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి కాల్ డేటాను సేకరించగా, హత్య జరిగిన రోజున ఇద్దరూ 124 సార్లు మాట్లాడుకున్నట్టు తేలింది. అలాగే అల్పన, మనీష్ స్నేహితుడు కృష్ణ కుమార్లు 19 సార్లు మాట్లాడుకున్నారు. హత్యకు ముందు ముగ్గురూ చాటింగ్ కూడా చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా, అల్పన, మనీష్, కృష్ణ కుమార్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

More Telugu News