తిరుమలలో రద్దీ సాధారణం... మూడు గంటల్లో దర్శనం!

10-01-2020 Fri 08:20
  • ఓ వైపు సంక్రాంతి, మరో వైపు చలి
  • మందగించిన భక్తుల రాక
  • ముక్కోటి తరువాత నిండని వైకుంఠం క్యూ కాంప్లెక్స్

చలి తీవ్రత పెరగడం, సంక్రాంతి పండగల కారణంగా తిరుమలలో గత మూడు రోజులుగా రద్దీ సాధారణంగానే ఉంది. స్వామి సర్వదర్శనానికి గరిష్ఠంగా ఆరు గంటలు మాత్రమే పడుతోంది. భక్తుల రాక మందగించడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు వెలవెలబోతున్నాయి. ముక్కోటి ఏకాదశి తరువాత ఇంతవరకూ అన్ని కంపార్టుమెంట్లూ నిండనే లేదు.

ఈ ఉదయం స్వామిని దర్శించుకునే భక్తులు ఏడు కంపార్టుమెంట్లలో ఉన్నారని, వారికి 3 నుంచి 4 గంటల్లో దర్శనం పూర్తవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. దివ్యదర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన వారికి 2 గంటల్లోనే దర్శనం అవుతోందని వెల్లడించారు. గురువారం నాడు స్వామిని 65,677 మంది భక్తులు దర్శించుకున్నారని, 18,209 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, హుండీ ఆదాయం రూ. 2.75 కోట్లని అధికారులు తెలిపారు.