ఏపీలో మళ్లీ పెరిగిన విజయ పాల ధరలు.. నేటి నుంచే అమల్లోకి

10-01-2020 Fri 07:35
  • నాలుగు నెలల క్రితమే మూడు కేటగిరీల్లో పెంపు
  • ఇప్పుడు మరో మూడు కేటగిరీల్లో పెంచిన విజయ డెయిరీ
  • ఫుల్ క్రీం, గోల్డ్ పాల ధరలపై లీటరుకు రూ. 4 పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో విజయ పాల ధరలు మరోమారు పెరిగాయి. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) వెల్లడించింది. విజయ పాల ధరను నాలుగు నెలల క్రితమే మూడు కేటగిరీల్లో రెండు రూపాయలు పెంచారు. ఇప్పుడు మరో మూడు కేటగిరీల్లో అంటే.. విజయ ప్రీమియం (స్టాండర్డ్), విజయ స్పెషల్ (ఫుల్ క్రీం), విజయ గోల్డ్ పాల ధరలను పెంచుతూ యూనియన్ నిర్ణయం తీసుకుంది.

విజయ ప్రీమియం లీటర్ పాలపై రూ. 2 పెంచి రూ.52 చేయగా, ఫుల్ క్రీం పాల ధరను రూ.4 పెంచి రూ.58 చేసింది. విజయ గోల్డ్ పాల ధర ఇప్పటి వరకు లీటరుకు రూ. 56 ఉండగా, ఇప్పుడు దానిని రూ.60కి పెంచారు. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్టు విజయ డెయిరీ ప్రకటించింది.