అమరావతిని మార్చితే కాదు.. మార్చకుంటేనే విప్లవం: మంత్రి అవంతి

10-01-2020 Fri 06:48
  • అమరావతిలో ఉన్నది, ఇతర ప్రాంతాల్లో లేనిది ఏమిటో చంద్రబాబు చెప్పాలి
  • రాష్ట్రం మూడు ముక్కలు కావాలని చంద్రబాబు కోరుకుంటున్నారు
  • తెలంగాణ ఉద్యమం చంద్రబాబు వల్లే వచ్చింది

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చొద్దంటూ జరుగుతున్న ఆందోళనలపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతి నుంచి రాజధానిని మార్చితే విప్లవం వస్తుందని అంటున్నారని, కానీ జరిగేది అది కాదని అన్నారు. రాజధానిని విశాఖకు తరలించకపోతేనే విప్లవం వస్తుందని హెచ్చరించారు.

అమరావతిలో ఉన్నదీ, ఇతర ప్రాంతాల్లో లేనిది ఏమిటో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం కూడా చంద్రబాబు వల్లే వచ్చిందని అన్నారు. ఇప్పుడు రాష్ట్రం మూడు ముక్కలు కావాలని చంద్రబాబు కోరుకుంటున్నారని, అలా జరిగితే ఆయనకు సంతోషంగా ఉంటుందా? అని ప్రశ్నించారు. అమరావతి విషయంలో ఆందోళనలు ఇలాగే కొనసాగితే ఉత్తరాంధ్రలోనూ ఉద్యమం మొదలుపెడతామని మంత్రి అవంతి హెచ్చరించారు.