నేను పనిచేసే పద్ధతి కూడా అలాగే ఉంటుంది: మహేశ్ బాబు

09-01-2020 Thu 22:05
  • రిలీజ్ కు సిద్ధమైన మహేశ్ సరిలేరు నీకెవ్వరు
  • జనవరి 11న ప్రేక్షకుల ముందుకు
  • ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించిన సూపర్ స్టార్

ఎల్లుండి 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో మహేశ్ బాబు ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ చిత్రంలో తాను ఆర్మీ అధికారి పాత్ర పోషించానని, అందుకే ఫిట్ గా కనిపించడం కోసం ఏకంగా 6 కిలోల బరువు తగ్గానని వెల్లడించారు. పాత్రకు అనువుగా సిద్ధమవడం కోసం నెల ఆలస్యం అయిందని తెలిపారు.

ఎఫ్2 చిత్రం షూటింగ్ దశలో ఉన్నప్పుడు అనిల్ రావిపూడి ఈ కథ చెప్పాడని, అయితే తనకు వేరే కమిట్ మెంట్ ఉండడంతో తర్వాత చేద్దామని భావించినట్టు చెప్పారు. కానీ ఎఫ్2 చూశాక తన మనసు మార్చుకున్నానని, అనిల్ రావిపూడి చిత్రాన్ని ముందు పూర్తిచేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

ఒక్కసారి కథ నచ్చి ఓకే చెప్పిన తర్వాత దర్శకుడు ఎలా చెబితే అలా నడుచుకుంటానని, అప్పటివరకు నేర్చుకున్నది పక్కనపెట్టేసి, మళ్లీ ఫ్రెష్ గా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని మహేశ్ బాబు తన వర్కింగ్ స్టయిల్ గురించి చెప్పారు. అలా చేయడమే తనకిష్టమని, తన పరిధిలో కొత్తగా ఏం చేయగలమని ఆలోచిస్తానని పేర్కొన్నారు.

కొన్నిసార్లు ప్రయోగాలు చేయాలనుకోవడం ఆలోచించడానికి బాగానే ఉంటుందని, కానీ ఆచరణలో సాధ్యం కాకపోవచ్చని అన్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్రహీరోలంతా ఓ విచిత్రమైన జోన్ లో ఉన్నామని, ప్రయోగాలు చేయలేని పరిస్థితిలో ఉన్నామనుకోవచ్చని వ్యాఖ్యానించారు.