పవన్ నాయుడు అంటారా.... మరి నిన్ను నాని రెడ్డి అని పిలవాలా?: చంద్రబాబు వ్యంగ్యం

09-01-2020 Thu 20:36
  • పవన్ కల్యాణ్ ను పవన్ నాయుడు అని పేర్కొన్న మంత్రి పేర్ని నాని
  • అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • నిన్ను జోసెఫ్ నాని, జాన్ నాని అని పిలవాలా అంటూ సెటైర్లు

మచిలీపట్నం సభలో చంద్రబాబునాయుడు వైసీపీ నేతలపై వ్యంగ్యం ప్రదర్శించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను పవన్ నాయుడు అంటున్నారని, మరి ఈ నానీని నానీ రెడ్డి అని పిలవాలా? లేక జోసెఫ్ నానీనా? లేక జాన్ నానీనా? అంటూ నవ్వులు కురిపించారు.

మాట్లాడేందుకు, నోటికి హద్దుండాలని ఈ సందర్భంగా హితవు పలికారు. "ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతున్నారు. పవన్ కల్యాణ్ స్వశక్తితో పైకొచ్చిన వ్యక్తి అయితే, మీరు రాష్ట్రాన్ని దోపిడీ చేసి పైకొచ్చిన వ్యక్తులు. మీరా మాట్లాడేది?" అంటూ మండిపడ్డారు.

"నేను జోలె పట్టడాన్ని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇది నా అవసరం కాదు. సమాజం కోసం జోలె పట్టాను. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. స్వార్థం వద్దు. స్వార్థంతో ముందుకెళ్లుంటే మహాత్మాగాంధీ స్వాతంత్ర్యాన్ని సాధించేవాడు కాదు. బ్రిటీష్ వాళ్లకు భయపడి ఉంటే పోరాటం సాగించేవాడు కాదు. ఇప్పుడు ఇతను కూడా కేసులు పెడుతున్నాడు. ఈ కేసులకు భయపడతామా, కేసులకు భయపడి ఉద్యమాన్ని ఆపుతామా?" అంటూ ప్రసంగించారు.

వాస్తవానికి మచిలీపట్నం ప్రజాచైతన్య యాత్రకు నేతలను పంపిద్దామని అనుకున్నట్టు తెలిపారు. ఎప్పుడేతై విజయవాడలో బస్సులను ఆపేశారో, తమ ప్రయత్నాలను భగ్నం చేయాలనుకున్నారో చూసిన తర్వాత ఇక లాభం లేదు రంగంలోకి దిగాల్సిందేనని నిశ్చయించుకున్నామని చంద్రబాబు చెప్పారు.