మేము అధికారంలోకొచ్చి ఏడు నెలలు.. అప్పుడే దోచేసుకున్నామట!: మంత్రి బొత్స ఫైర్

09-01-2020 Thu 19:57
  • టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు
  • మాది ‘ఆంబోతు ప్రభుత్వం’ అంటారా?
  • లోకేశ్ ‘భాష’ జాగ్రత్తగా ఉండాలి

'మేము అధికారంలోకి వచ్చి ఏడు నెలలు.. అప్పుడే దోచేసుకున్నామట!' అంటూ టీడీపీ నేతలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నేతలు వారి ఇష్టమొచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వాన్ని ‘ఆంబోతు ప్రభుత్వం’గా నారా లోకేశ్ అభివర్ణించారని, ‘భాష’ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

చంద్రబాబు, రామోజీరావుల ఆలోచనలకు అనుగుణంగా తాము నడవమని, తమ ప్రభుత్వానికి ఒక బాధ్యత, ఆలోచన ఉన్నాయని, దాని ప్రకారమే ముందుకు వెళ్తాం తప్ప, ఎవరి బ్లాక్ మెయిలింగ్ కో, పిచ్చి పిచ్చి రాతలకో భయపడే ప్రసక్తే లేదని, దేనికీ లొంగమని స్పష్టం చేశారు. 'ఏపీలోని మూడు ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చూడండి, ఎందుకు తొందర?' అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘ఈనాడు పత్రిక మాకేమన్నా బాసా? ఈ పత్రిక రాసిందని మమ్మల్ని ప్రజలు ఏమైనా ఎన్నుకున్నారా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.