నేను కట్టిన సెక్రటేరియట్, నేను కూర్చున్న కుర్చీలో కూర్చోవడం తప్ప మీరు చేసిందేమిటి?: చంద్రబాబు

09-01-2020 Thu 19:07
  • జీవితంలో తొలిసారిగా జోలె పట్టాను
  • అమరావతికి దేవుళ్ళందరి ఆశీస్సులు వున్నాయి
  • అమరావతికి అడ్డొస్తే ఎవరినీ వదిలిపెట్టం
  • రాజధాని ఏదంటే మూడు పేర్లు చెప్పాలా?

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మచిలీపట్నంలో భావోద్వేగాలతో ప్రసంగించారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా జోలె పట్టి విరాళాలు సేకరించిన చంద్రబాబు, అనంతరం రోడ్ షోలో ప్రసంగించారు. జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలు ఏకమయ్యాయని తెలిపారు. అన్ని పార్టీల నుంచి నేతలు మచిలీపట్నం వచ్చింది రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని అన్నారు. తన జీవితంలో ఇంతకు ముందెప్పుడూ జోలె పట్టలేదని, మొట్టమొదటిసారి జోలె పట్టి ప్రార్థించానని వెల్లడించారు.

"కలల రాజధానిగా అమరావతిని హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేయాలని భావించాను. కానీ బాధ. నా అదృష్టమో మీ దురదృష్టమో తెలియదు కానీ జోలె పట్టి అర్థించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఊర్లో జోలె పట్టినందుకు రూ.3.05 లక్షల డబ్బు, ఓ ఉంగరం దానం చేశారు. ఇవన్నీ జేఏసీకి అప్పగిస్తున్నా. ఇవి పార్టీ కోసం కాదు. ఉద్యమానికి ఇస్తున్నాం. అమరావతిలో ప్రపంచంలోని అందరు దేవుళ్ల ఆశీస్సులున్నాయి. అమరావతిని కదిలించే శక్తి ఎవరికీ లేదు తమ్ముళ్లూ! ఈ అమరావతికి అడ్డొస్తే ఎవరినీ వదిలిపెట్టం.

అసలు, అమరావతి చేసిన తప్పేంటి? అమరావతిలో అన్నీ ఉన్నాయని ఈనాడు పేపర్ చెప్పింది. మీరు అధికారంలోకి వచ్చి అమరావతికి చేసిందేమిటి? నేను కట్టిన సెక్రటేరియట్, నేను కూర్చున్న కుర్చీలో తప్ప మీరు ఏం చేశారు? ఒక్క ఇటుక పెట్టారా, ఒక్క పనిచేశారా, రాజధానికి లక్ష పది కోట్లు కావాలని మాయమాటలు చెబుతున్నారు. అది ఎప్పటికి కావాలి... 2050 నాటికి!. మీకు చేతకాకపోతే చెప్పండి, చేసి చూపించే ధైర్యం మాకుంది.

ఇది ప్రజా రాజధాని. జగన్ మోహన్ రెడ్డి రాజధాని కాదు. ఐదు కోట్ల ప్రజల కలల రాజధాని. మనక్కూడా ఓ అడ్రస్ ఉండాలి కదా. ఎక్కడికైనా వెళితే రాజధాని ఏదంటే మూడు పేర్లు చెప్పాలా. సిగ్గులేదా? అని అడుగుతున్నాను. తెలంగాణ వెళితే హైదరాబాద్ పేరు చెబుతారు. హైదరాబాద్ ను నేను అభివృద్ధి చేశా. నా పేరు చెప్పరు కానీ, సైబరాబాద్, ఎయిర్ పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డు తీసుకువచ్చాను. నా తర్వాత వచ్చిన సీఎంలు జగన్ లాంటివాళ్లయ్యుంటే హైదరాబాద్ అంత అభివృద్ధి చెందుండేది కాదు" అంటూ వ్యాఖ్యానించారు.