ఒకే రోజు నలుగురికి ఉరి... దేశంలో ఇదే తొలిసారి కాదు!

09-01-2020 Thu 18:01
  • 1983లో మహారాష్ట్రలో నలుగురు విద్యార్థుల ఉరితీత
  • వరుస హత్యలతో హడలెత్తించిన నలుగురు విద్యార్థులు
  • మద్యానికి బానిసలై మనుషుల ప్రాణాలు తీసిన వైనం

దేశవ్యాప్తంగా ఇప్పుడు నిర్భయ దోషులకు ఉరి గురించిన చర్చ జరుగుతోంది. నలుగురు నిర్భయ దోషులనూ ఒకేరోజు ఉరితీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, ఒకే రోజు నలుగుర్ని ఉరితీసిన సంఘటన గతంలోనూ జరిగింది. 70వ దశకంలో మహారాష్ట్రలో వరుస హత్యలకు పాల్పడిన నలుగుర్ని ఒకే రోజు ఉరి కొయ్యకు వేలాడదీశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది హత్యలు... ఇవన్నీ నలుగురు విద్యార్థులు చేశారంటే నమ్మశక్యం కాదు. కానీ, జల్సాలకు అలవాటు పడి, వ్యసనాలకు బానిసలై మనుషుల ప్రాణాలను కిరాతకంగా బలిగొన్నారు.

పూణేలోని అభినవ్ కళా మహావిద్యాలయ కళాశాలలో మునావర్ హరూన్ షా, రాజేంద్ర జక్కల్, శాంతారామ్ జగతాప్, దిలీప్ సుతార్ అనే నలుగురు విద్యార్థులు మద్యానికి బానిసలయ్యారు. చేతి నిండా డబ్బు లేకపోవడంతో దొంగతనాలకు అలవాటు పడి, ఆపై హంతకుల్లా మారారు. మొదట తమ సహవిద్యార్థిని కిడ్నాప్ చేసి అంతమొందించారు. ఆ తర్వాత ఇళ్లలో చొరబడి దోపిడీలకు పాల్పడి హత్యలు చేసేవారు. దోపిడీ చేశాక నోట్లో దూది కుక్కి, గొంతుకు నైలాన్ తాడు బిగించి చంపడం వీరి నైజం.

1976 నుంచి 77 మధ్యలో వీరి హత్యాకాండ యథేచ్ఛగా కొనసాగింది. అప్పట్లో వారు చేసిన 10 హత్యలు 'జోషి-అభ్యాంకర్' (జోషి కుటుంబ సభ్యులను, అభ్యాంకర్ కుటుంబ సభ్యులను చంపడంతో ఈ పేరు వచ్చింది) సీరియల్ హత్యలుగా సంచలనం రేపాయి. ఎవరు చంపుతున్నారో తెలియక పూణే పరిసరాల ప్రజలు హడలిపోయారు. ఈ కేసును ఓ సవాల్ గా స్వీకరించిన మహారాష్ట్ర పోలీసులు నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.  

వీరు చేసిన ఘాతుకాలపై విచారణ జరిపిన న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. 1983 అక్టోబరు 25న పూణే యెరవాడలో జైల్లో ఈ నలుగుర్ని ఒకే రోజు ఉరి తీశారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఒకే రోజు నలుగురికి ఉరి అమలు చేయనున్నారు. నిర్భయ దోషులకు జనవరి 22న ఉదయం 7 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైల్లో మరణశిక్ష అమలు చేయనున్నారు.