ఏపీ రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటన

09-01-2020 Thu 17:56
  • భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలి
  • గత ప్రభుత్వం  రైతులతో  చేసుకున్న ఒప్పందాలు గౌరవించాలి
  • రాజధానిపై కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులకు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలు కేంద్రం వద్దకు రాలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రాజధానుల విషయమై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు సమర్పించలేదన్నారు.

అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ అక్కడి రైతులు అమరావతి పరిరక్షణ సమితి పేర ఆందోళనలు చేస్తోన్న నేపథ్యంలో మంత్రి స్పందించారు.  రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అని చెప్పారు. అయితే గత ప్రభుత్వ హయాంలో రాజధానికోసం భూమిలిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వంతో రైతులు చేసుకున్న ఒప్పందాలను గౌరవించాలన్నారు. రైతుల ఆందోళనలపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు.