జగన్ పై కేసులను త్వరగా తేల్చండి: వర్ల రామయ్య

09-01-2020 Thu 17:29
  • వర్ల మీడియా సమావేశం
  • విచారణ వేగవంతం చేయాలని సీబీఐ కోర్టుకు విన్నపం
  • రేపు వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతున్న సీఎం జగన్

ఈ శుక్రవారం ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతున్న నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం జగన్ ఎదుర్కొంటున్న ఆరోపణలపై సీబీఐ కోర్టు విచారణను వేగవంతం చేయాలని కోరారు. జగన్ పై ఆస్తుల కేసు నమోదై ఎనిమిదేళ్లయినా ఇప్పటికీ తీర్పు వెలువడలేదని తెలిపారు. ఈ కేసులో తీర్పు కోసం చూస్తున్నామని పేర్కొన్నారు.

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సీఎంగా తనకు బిజీ షెడ్యూల్ ఉంటుందని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరినా, ప్రతివారం మినహాయింపు కుదరదని, వ్యక్తిగతంగా హాజరు కావల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. దీనిపైనా వర్ల సెటైర్ వేశారు. రేపు సీబీఐ కోర్టు ముందు జగన్ హాజరయ్యేది వ్యక్తిగత హోదాలోనా? లేక అధికారిక హోదాలోనా? అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ముఖ్యమంత్రిగా ఉంటూ కోర్టుకు ముద్దాయిగా వెళుతోంది జగన్ మాత్రమేనని వ్యాఖ్యానించారు.