కాంగ్రెస్, వామపక్షాలవి రెండు నాల్కల ధోరణి.. మేం ఒంటరిగానే పోరాడతాం: మమతా బెనర్జీ

09-01-2020 Thu 17:01
  • సీఏఏపై వాళ్లవి నీచ రాజకీయాలు
  • మేం ఇతర పార్టీలతో కలవం
  • కేంద్రం దిగొచ్చేవరకు పోరాటం ఆపేదిలేదు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై తమ పోరాటం ఆగదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ పోరాటంలో కాంగ్రెస్, వామ పక్షాలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు.

ఈ రోజు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో జరిపిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న మమత మాట్లాడుతూ.. సీఏఏపై అనుసరించాల్సిన వ్యూహంపై ఈ నెల 13న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిపక్షాలతో నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొనాలని తమ పార్టీని కూడా ఆహ్వానించారని, అయితే తాము ఆ సమావేశానికి హాజరు కావడంలేదని చెప్పారు.

కాంగ్రెస్, వామ పక్షాలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ.. తమ పార్టీ ఎవరితో కలవదని స్పష్టం చేశారు. ఒంటరిగానే పోరాటం చేస్తామని తెలిపారు. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం ఆపమని చెప్పారు.