మలేసియా మాస్టర్స్ టోర్నీ: క్వార్టర్ ఫైనల్లో సైనా, సింధు

09-01-2020 Thu 16:35
  • ప్రి క్వార్టర్ పోరులో ఓహోరిని ఓడించిన సింధు
  • అన్ సెయంగ్ ను ఓడించి క్వార్టర్ అర్హత సాధించిన సైనా
  • పురుషుల సింగిల్స్ లో సమీర్ వర్మ ఓటమి

మలేసియా మాస్టర్స్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు సైనా, సింధులు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. ఈ రోజు జరిగిన మహిళల సింగిల్స్ తొలి ప్రి క్వార్టర్స్ పోరులో సింధు తన ప్రత్యర్థి జపాన్ కు చెందిన అయా ఓహోరిని 21-10, 21-15 తేడాతో ఓడించింది. ఆరో సీడ్ గా బరిలోకి దిగిన సింధు రెండు గేముల్లోనూ ఆధిక్యతను చాటింది. 34 నిమిషాల్లో మ్యాచ్ ను ముగించింది. క్వార్టర్ ఫైనల్లో సింధు చైనీస్ తైపైకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ తైజు ఇంగ్ లేదా దక్షిణ కొరియాకు చెందిన సంగ్ జి యూన్ తో తలపడనుంది.

మరో ప్రి క్వార్టర్ పోరులో సైనా నెహ్వాల్ దక్షిణ కొరియాకు చెందిన షట్లర్ అన్ సెయంగ్ ను 25-23, 21-12 తేడాతో ఓడించి తర్వాతి పోటీకి అర్హత సాధించింది. తొలి గేములో పోరాడి గెలిచిన సైనా రెండో గేమ్ లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిక్యతను కనబర్చింది. సైనా క్వార్టర్ ఫైనల్లో ఒలింపిక్ విజేత స్పెయిన్ కు చెందిన కరోలినా మారిన్ ను ఢీకొననుంది. పురుషుల విభాగంలో సింగిల్స్ పోటీలో సమీర్ వర్మ నిరాశ పర్చాడు.  మలేసియా ఆటగాడు లీజీ జియా చేతిలో పరాజయం పాలయ్యాడు.