శ్రీనగర్ లోని పరిస్థితిని ఏపీకి తీసుకురావడం అన్యాయం: టీడీపీ నేత అశోక్ గజపతిరాజు

09-01-2020 Thu 12:24
  • అమరావతిపై సంతకాల సేకరణలో పాల్గొన్న నేత
  • రాజశేఖర్ రెడ్డి, జగన్ పాదయాత్రల్లో అరెస్టులు జరిగాయా?
  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయడం దుర్మార్గం  

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ విజయనగరంలో టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంతకాల సేకరణ చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గమ్మత్తైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. శ్రీనగర్ లోని పరిస్థితిని ఏపీలోకి తీసుకురావడం అన్యాయమన్నారు. గతంలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రల్లో అరెస్టులు జరిగాయా? అంటూ ప్రశ్నించారు.

ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నేతల అరెస్టు సంస్కృతి లేదని చెబుతూ.. జగన్ ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెర లేపిందని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టును ఆపి విశాఖకు నీరు తెస్తాననడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేసుకుని వెళ్లాలన్నారు. అందరినీ రోడ్డున పడేసే ప్రయత్నాలు మంచిదికాదని సీఎం జగన్ కు సూచించారు.