గుజరాత్ లో రోడ్డు ప్రమాదం.. మంటల్లో గ్యాస్ సిలిండర్ల ట్రక్, పాఠశాల బస్సు!

09-01-2020 Thu 11:39
  • విద్యార్థులు బస్సునుంచి దిగిపోవడంతో తప్పిన ప్రమాదం
  • ఒక్కొక్కటిగా పేలుతున్న సిలిండర్లు 
  • మంటలనార్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ లో గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళుతున్న ట్రక్ అదుపుతప్పి బోల్తా పడటంతో దానిలో సిలిండర్లు పేలడం ప్రారంభించాయి. బోల్తా పడ్డ ప్రదేశంలోనే ఓ పాఠశాల బస్సు ఉండటంతో... డ్రైవర్ అప్రమత్తమై విద్యార్థులను దించి సురక్షిత ప్రదేశానికి తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది. సిలిండర్ల పేలుడుకు ట్రక్ తో పాటు బస్సుకు మంటలు అంటుకున్నాయి.

ట్రక్కులోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలడంతో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. మంటలను నియంత్రించడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిలిండర్ల పేలుడు దృశ్యాలను కొంతమంది మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు.