జేఏసీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు.. భారీగా మోహరించిన పోలీసులు

09-01-2020 Thu 11:24
  • విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి సమావేశం
  • బెంజ్ సర్కిల్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు
  • సమావేశానంతరం మచిలీపట్నంకు ర్యాలీ

ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన చంద్రబాబు విజయవాడలోని అమరావతి జేఏసీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. కాసేపట్లో అమరావతి పరిరక్షణ సమితి సమావేశం జరగబోతోంది. అంతకు ముందే కార్యాలయానికి సీపీఐ నేత రామకృష్ణ చేరుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత నేతలంతా ర్యాలీగా మచిలీపట్నం బయల్దేరనున్నారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, అరెస్ట్ ల ద్వారా ఉద్యమాలను ఆపలేరని చెప్పారు. అమరావతే రాజధానిగా ఉండాలని రాష్ట్రమంతా కోరుకుంటోందని అన్నారు. కుంటి సాకులతో బస్సు యాత్రను ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. బస్సు యాత్రను అడ్డుకుంటే ఫూల్స్ గా మిగిలిపోతారని చెప్పారు. మచిలీపట్నంకు వెళ్లే ర్యాలీని అడ్డుకుంటే ప్రభుత్వంతో తేల్చుకుంటామని హెచ్చరించారు.