సోషల్ మీడియాలో విమర్శలకే జగన్ భయపడిపోతున్నారు: నారా లోకేశ్

09-01-2020 Thu 10:59
  • వైసీపీ నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు
  • బండ బూతులు తిడుతున్నా కేసులు పెట్టడం లేదు
  • న్యాయస్థానాల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు

టీడీపీ అభిమాని అవినాశ్ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని నారా లోకేశ్ తెలిపారు. అవినాశ్ తో సహా టీడీపీ సోషల్ మీడియా వాలంటీర్లకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారని... భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తూ, మానవ హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు తొత్తులుగా మారుతూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టారు. చేస్తున్న ప్రతి తప్పుకీ న్యాయస్థానాల్లో పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.

వైసీపీ నేతలకు బూతులు మాట్లాడే హక్కును కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని ఏమైనా తీసుకొచ్చారా? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. బరి తెగించి, హద్దు మీరి రైతులను, మహిళలను, ప్రతిపక్ష నేతలను వైసీపీ నేతలు బండ బూతులు తిడుతున్నా ఎలాంటి కేసులు పెట్టడం లేదని మండిపడ్డారు. తాము ఫిర్యాదు చేసినా... భావప్రకటనా స్వేచ్ఛ, కేసులు నమోదు చేయలేము అని పోలీసులు అంటున్నారని తెలిపారు. చట్టం అందరికీ సమానమే అనే విషయాన్ని పోలీసులు మర్చిపోతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలకే ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారని... ఇక ప్రజాగ్రహాన్ని ఎలా తట్టుకుంటారని ఎద్దేవా చేశారు.