ప్రాణ నష్టం జరగలేదని ఇరాక్ ప్రకటన.. భారీ దాడికి సిద్ధమవుతున్న అమెరికా

09-01-2020 Thu 10:49
  • బాగ్దాద్ గ్రీన్ జోన్ పై మిస్సైళ్లతో ఇరాన్ దాడి
  • రెండు కత్యూషా రాకెట్లను ప్రయోగించారన్న ఇరాక్
  • ఎఫ్-35 విమానాలను బయటకు తీసిన అమెరికా

తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని... శాంతిని కోరుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాక్ లోని గ్రీన్ జోన్ పై ఇరాన్ రెండు క్షిపణులను ప్రయోగించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఉన్న గ్రీన్ జోన్ లోనే అమెరికాతో పాటు ఇతర దేశాల ఎంబసీలు ఉన్నాయి. అత్యంత పటిష్టమైన భద్రత ఉన్న ఈ ప్రాంతంపై ఇరాన్ రాకెట్లను ప్రయోగించింది.

మరోవైపు ఈ దాడులకు సంబంధించి ఇరాక్ సెక్యూరిటీ సర్వీసెస్ ఒక ప్రకటనను విడుదల చేసింది. గ్రీన్ జోన్ పై రెండు కత్యూషా రాకెట్లు పడ్డాయని తెలిపింది. అయితే, ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పింది.

ఈ దాడులను అమెరికా సీరియస్ గా తీసుకుంది. అత్యాధునికమైన ఎఫ్-35 యుద్ధ విమానాలను బయటకు తీయాలని అమెరికా రక్షణశాఖ ఆదేశించింది. ఈ ఆదేశాలతో పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా వార్ షిప్ లపై ఎఫ్-35లను మోహరింపజేయనున్నారు. వార్ షిప్ లపై ఫైటర్ జెట్స్ ను కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే... ఇరాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటానికి అమెరికా సిద్ధమవుతున్నట్టు అర్థమవుతోంది.